వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆతిథ్య పాకిస్థాన్ ఏర్పాట్లు చకచకా చేస్తోంది. యుద్ధ ప్రాతిపదికన స్టేడియాల్లో మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించింది. అయితే భారత్ మాత్రం పాకిస్థాన్‌లో పర్యటిస్తుందా లేదా అనే విషయంపై మాత్రం సందిగ్ధత కొనసాగుతోంది. కొందరేమో.. ఇరు దేశాల మధ్య ఘర్షణలను పక్కకు పెట్టి ఆటకోసమైనా భారత్.. పాక్‌కు వెళ్లాల్సిందే అని పట్టుబడుతున్నారు. పలువురు పాకిస్థాన్ మాజీలు విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ల కోసం పాకిస్థాన్ అభిమానులు ఎదురుచూస్తున్నారని.. చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ తమ దేశానికి రావొద్దని వ్యాఖ్యానించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా వ్యాఖ్యానించాడు. ఓ స్పోర్ట్స్ ఛానెల్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు పాకిస్థాన్‌కు రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. కానీ నన్ను అడిగితే భారత్.. పాకిస్థాన్‌కు వెళ్లకూడదనే చెబుతా. పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు వసతులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం దేశంలో పరిస్థితి చూస్తే.. అన్ని జట్లకూ భద్రత కల్పించడం కష్టం. ఏ జట్టుకైనా ప్రస్తుతం భద్రతే ముఖ్యం.. ఆ తర్వాత గౌరవం. నాకు తెలిసీ.. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడమే ఉత్తమం” అని డానిష్ కనేరియా వ్యాఖ్యానించాడు.
భారత్ చివరిసారిగా.. 2008లో ఆసియాకప్ కోసం పాకిస్థాన్‌లో పర్యటించింది. ఇరు దేశాల మధ్య చివరిసారిగా 2012-2013లో ద్వైపాక్షిక సిరీస్ జరగనుంది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ.. ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. అయితే టీ20 ప్రపంచకప్ 2016, వన్డే ప్రపంచకప్ 2023లో పాల్గొనేందుకు పాకిస్థాన్ జట్టు.. భారత్‌కు వచ్చింది. కానీ భారత్ మాత్రం ఆ దేశంలో అడుగుపెట్టలేదు. గతేడాది కూడా ఆసియాకప్‌లో భారత్ ఆడే మ్యాచులు శ్రీలంకలోనే జరిగాయి. ఆ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే దుబాయ్‌లో భారత్ ఆడే మ్యాచులు జరిగే అవకాశం ఉంది. కానీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం.. భారత క్రికెట్ జట్టు ఎట్టిపరిస్థితుల్లోనూ భారత్‌కు రావాల్సిందే అని పట్టుబడుతోంది. వాఘా-అట్టారీ సరిహద్దు సమీపంలోని లాహోర్‌లో భారత్ ఆడే మ్యాచులు నిర్వహించాలని పీసీబీ యోచిస్తున్నట్లు సమాచారం. అలా అయితేనే.. భారత ప్రేక్షకుల ప్రయాణం సులభతరం అవుతుందని ఆ బోర్డు ఆలోచిస్తోంది. దీనిపై త్వరలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.