నాగార్జున హీరో కాదు విలన్.. ఆ ఒక్క కారణంతోనే మంత్రిని ఇబ్బంది పెడుతున్నారు: తీన్మార్ మల్లన్న

తెలంగాణ రాజకీయాలతో పాటు తెలుగు చిత్ర సీమలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మీద విమర్శలు చేసే క్రమంలో.. నాగచైతన్య, సమంత విడాకుల గురించి ప్రస్తావిస్తూ.. అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను అటు రాజకీయ నాయకులతో పాటు తెలుగు చిత్రపరిశ్రమకు సంబంధించి చాలా మంది ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతేకాకుండా.. కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా కూడా వేశారు. అయితే.. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ స్పందించారు.

తనకు సంబంధించిన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారమయ్యే మార్నింగ్ న్యూస్ కార్యక్రమంలో.. మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేయటాన్ని తీన్మార్ మల్లన్న తీవ్రంగా తప్పుబట్టారు. ఒక బీసీ మహిళా మంత్రిపై నాగార్జున కాలు దువ్వుతున్నాడన్న తీన్మార్ మల్లన్న.. అదే నాగార్జున ఎన్- కన్వెన్షన్ సెంటర్ కట్టినప్పుడు చిత్రపరిశ్రమకు చెందిన వారెవ్వరూ మాట్లాడలేదని గుర్తు చేశారు. ప్రభుత్వ భూమిని ఎందుకు కబ్జా చేస్తున్నావని ఏ ఒక్కరూ ప్రశ్నించలేదన్నారు. నాగార్జున హీరో కాదని విలన్ అవుతాడని ఎందుకు నిలదీయలేదన్నారు. ఒక బీసీ మహిళ మంత్రిగా ఉంటే.. అందరూ ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. ఇది ఎంతవరకు వెళ్తుందో తానూ చూస్తానంటూ వ్యాఖ్యానించారు.

అక్కినేని కుటుంబం మీద కొండా సురేఖ ఏదో మిస్ ఫైర్ అయి మాటలు వదిలేశారని.. ఆ తర్వాత క్షమాపణలు కూడా అడిగారని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఆమెను చిత్రపరిశ్రమకు చెందిన వాళ్లు ఇంకా తిడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. తీన్మార్ మల్లన్న చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల గురించి ఆమె చేసిన ఆరోపణల గురించి మాట్లాడాల్సింది పోయి.. ఇక్కడ బీసీ కార్డుతో తీన్మార్ మలన్న మరో రాజకీయం చేస్తున్నారంటూ కామెంట్ల రూపంలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. నాగార్జున వేసి పరువు నష్టం దావాపై విచారణను నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో.. ఈ విచారణ వాయిదా పడింది. మళ్లీ సోమవారం (అక్టోబర్ 7న) రోజున విచారణ చేపట్టనున్నారు. కాగా.. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తాను షాక్ అయ్యానని.. ఆమె చేసిన తప్పుడు ఆరోపణలతో అక్కినేని కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని పిటిషన్‌లో నాగార్జున పేర్కొన్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు, కేటీఆర్‌కు, నాగార్జున- సమంత విడాకులకు ఎలాంటి లింక్ లేదని.. నాగార్జున స్పష్టం చేశారు. సెక్షన్ 356 బీఎన్ఎస్ కింద కొండా సురేఖపై చర్యలు తీసుకోవాని నాగార్జున కోరారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *