దేశంలోనే రెండో అతిపెద్ద లింక్ ఫ్లైఓవర్ యాదాద్రిలో ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో మెకలై స్టీల్‌తో ఈ లింక్ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్లు చెప్పారు. ఇది ఇండియాలోనే ఇది రెండో అతి పొడవైనదని.. మూడు నెలల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. బుధవారం (సెప్టెంబరు 18) తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YTDA), రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇప్పటి వరకు కేవలం ఎగ్జిట్ ఫ్లైఓవర్ పైనే ఆధారపడి ఆలయానికి వచ్చే భక్తులకు ఈ లింక్ బ్రిడ్జి ఉపశమనం కలిగిస్తుందని మంత్రి సురేఖ అన్నారు. యాదాద్రి దేవాలయం సమీపంలో 64 మీటర్లతో నిర్మించనున్న ఈ వంతెనను రానున్న మూడు నెలల్లో నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. యాదాద్రి గర్భగుడి విమాన గోపురానికి స్వర్ణతాపడం పనులపై కూడా కీలక ప్రకటన చేశారు. త్వరలోనే బంగారు తాపడం పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక యాదాద్రికి సమీపంలోని రాయగిరిలో దాదాపు 20 ఎకరాల్లో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో వేద పాఠశాల నిర్మాణ పనులను మొదలుపెడతామన్నారు. రూ.43 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ వేద పాఠశాలకు గోవిందహరి ఛైర్మన్‌గా ఉంటారన్నారు.