తమిళ రాజకీయాలు-సినిమాలు రెండింటినీ వేర్వేరుగా చూడటం అసాధ్యం. ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీ స్థాపించిన ఎంజీఆర్ నుంచి ఆ పార్టీని అదే రేంజ్‌లో ముందుకు తీసుకెళ్లిన జయలలిత వరకూ అందరూ సినీనటులే. అలానే డీఎంకే పార్టీని నడిపించిన కరుణానిధి నుంచి ఆ పార్టీలో కీలకంగా ఉన్న ఆయన మనవడు ఉదయనిధి స్టాలిన్ వరకూ అందరూ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లే. ఇక కమల్ హాసన్ కూడా రాజకీయ పార్టీ పెట్టి తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. అయితే ఇటీవల కోలీవుడ్ స్టార్ దళపతి కూడా రాజకీయ రంగప్రవేశం చేసి తమిళగ వెట్రి కళగం (TVK) అంటూ పార్టీని స్థాపించారు. తాజాగా ఆయన తన పార్టీ జెండాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం చెన్నైలో జరిగింది.
జెండాలో ఇవి గమనించారా?
విజయ్ పార్టీ జెండా అందరినీ ఆకర్షించేలా ఉంది. ఎరుపు, పసుపు రంగులతో కూడిన ఈ జెండాలో మధ్యలో ఓ పువ్వు కనిపిస్తుంది. ఆ పువ్వుకి రెండు వైపులా ఏనుగులు ఉన్నాయి. పనయూర్‌లోని పార్టీ ఆఫీస్‌లో ఈ జెండాని దళపతి ఆవిష్కరించారు. ఇక ఈ జెండాలో మధ్యలో కనిపించే పువ్వు ఏంటా అని చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమంది అయితే సూర్యుడు అని భ్రమ పడుతున్నారు. కానీ ఆ పువ్వు పేరు ‘వాగాయ్’. తమిళనాడు చరిత్రలో దీనికి చాలా గుర్తింపు ఉంది. అప్పట్లో చోళులు, పాండ్యులు పరిపాలించిన సమయంలో యుద్ధంలో గెలిచిన వారికి ఈ పూలతోనే దండలు చేసి స్వాగతం పలికేవారు. అందుకే ఈ పూలని విజయానికి ప్రతీకగా చూస్తారు. ఇప్పుడు విజయ్ తన జెండాపై ఈ పువ్వును పెట్టడం విజయ సూచికగా భావిస్తున్నారు ఫ్యాన్స్.
ఇక ఈ జెండాపై ప్రముఖ తమిళ కవి తిరువళ్లువర్ రాసిన ఓ కొటేషన్ కూడా ఉంది. “పిరపోక్కుమ్ ఎల్ల ఉయుర్కుమ్” అంటే పుట్టుకతో అందరూ సమానమే అని అర్థం అన్నమాట. అంటే తన పార్టీ సిద్ధాంతం ఏంటో చెప్పకనే చెప్పారు విజయ్. ఇక జెండా ఆవిష్కరణతో పాటు తన పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు. “ఇవాళ పార్టీ జెండాని ఆవిష్కరించడం ఎంతో గర్వంగా ఉంది. తమిళనాడు అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేద్దాం. సామాజిక న్యాయమే నా లక్ష్యం. ఇదే బాటలో అంతా నడుద్దాం” అంటూ విజయ్ స్పీచ్ ఇచ్చారు. సామాజిక న్యాయం అనగానే తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీనే. ఎందుకంటే సామాజిక న్యాయం సిద్ధాంతంతోనే ఈ పార్టీని స్థాపించారు చిరు.