శబరిమల అయ్యప్ప ఆలయంలో నవంబరు 16 నుంచి మండల పూజలు ప్రారంభం కానున్నాయి. నెలవారీ పూజల కోసం అక్టోబరు 17న ఆలయం తెరుచుకోగా.. వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. మూడు రోజుల అనంతరం ఆదివారం సాయంత్రం ఆలయాన్ని మూసివేశారు. ముందు రెండు రోజులతో పోల్చితే ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. ఇదిలా ఉండగా, అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ప్రత్యేకంగా ఓ రేడియోను ప్రారంభించనుంది. ‘రేడియో హరివరాసనం’ పేరుతో ఆన్‌లైన్ రేడియో సర్వీసులను త్వరలోనే ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. భౌతికంగా శబరిమలకు రాలేని భక్తులకు స్వామిని దగ్గర చేయడమే లక్ష్యంగా దీనిని అందుబాటులోకి తీసుకొస్తామని, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా దీనిని వినవచ్చని పేర్కొంది.
ఈ రేడియో నిర్వహణ బాధ్యతలు దేవస్థానం బోర్డు పర్యవేక్షణలోనే ఉంటాయి. సన్నిధానం నుంచే ప్రసారమవుతాయి. దేవుడి ప్రార్థనలు, భక్తి గీతాలను ప్రసారం చేయడంతో పాటు ఆలయంలో జరిగే వేడుకలు, శబరిమల చరిత్రలో ముఖ్యమైన కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఆలయం, సంప్రదాయాలకు సంబంధించి ఇంటర్వ్యూలు కూడా రేడియోలో ప్రసారమవుతాయని టీడీబీ తెలిపింది. రేడియో స్టేషన్ ఏర్పాటుకోసం దేవస్థానం బోర్డు టెండర్ ప్రక్రియ ప్రారంభించింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీచేసిన దేవస్థానం బోర్డు.. రేడియో పరిశ్రమలో కనీసం 15 ఏళ్ల అనుభవం ఉండాలని తెలిపింది.
శబరిమలలో నెలవారీ పూజల కోసం భక్తులు పోటెత్తడంతో దర్శనాలకు ఐదు నుంచి ఏడు గంటల పాటు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి తలెత్తింది. భక్తుల రాక ఊహించని దాని కంటే ఎక్కువగా ఉండటంతో అధికార యంత్రాంగం వారిని అదుపుచేయడానికి తీవ్రంగా శ్రమించింది. క్యూలో నిలిచిన వారికి తాగునీరు కూడా అందడం లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి.