తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిత్యం చర్యలు చేపడుతూనే ఉంటుంది. ఇందులో భాగంగానే దర్శన టికెట్ల దగ్గర నుంచి, శ్రీవారి అన్న ప్రసాదం, బస వరకూ అనేక చర్యలు చేపడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే శ్రీవాణి ట్రస్టు భక్తులకు దర్శన టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు శాశ్వత టికెట్ల జారీ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కౌంటర్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలిస్తోంది. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సోమవారం శ్రీవాణి భక్తులకు శాశ్వత టికెట్ల జారీ కేంద్రం ఏర్పాటు కోసం వివిధ స్థలాలను పరిశీలించారు. జేఈవో వీరబ్రహ్మంతో కలిసి పలు ప్రాంతాలలో స్థలాన్ని పరిశీలించారు.
గోకులం వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలంతో పాటుగా, ఆదిశేషు విశ్రాంతి గృహం పక్కనే ఉన్న టీటీడీ కల్యాణ మండపం ప్రాంతం, తిరుమల డిఎఫ్ఓ కార్యాలయం, అన్నమయ్య భవనంలోని సమావేశ మందిరాలను పరిశీలించారు. త్వరలోనే ఎక్కడ కౌంటర్ ఏర్పాటు చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు శ్రీవాణి ట్రస్టుకు విరాళం ఇచ్చిన భక్తులకు టీటీడీ తిరుమల వెంకన్న దర్శన సౌకర్యం కల్పిస్తోంది. ఇందుకోసమే శాశ్వతంగా ఓ కౌంటర్ ఏర్పాటు చేయాలని టీటీడీ సంకల్పించింది.
తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామికి టీటీడీ సారె
మరోవైపు తిరుత్తణిలోని సుబ్రమణ్యస్వామికి తిరుమల శ్రీవారి తరుఫు నుంచి పట్టువస్త్రాలను సమర్పించారు. టీటీడీ ఈవో శ్యామలరావు టీటీడీ తరుఫున పట్టువస్త్రాలను తిరుత్తణి ఆలయంలో సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ ఆధికారులకు తిరుత్తణి ఆలయ ఆధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం టీటీడీ సమర్పించిన పట్టు వస్త్రాలను స్వామివారికి అలంకరించారు. మరోవైపు ఆడికృత్తికను పురస్కరించుకుని ఏటా సుబ్రమణ్యస్వామికి టీటీడీ పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. 2006 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా టీటీడీ నుంచి తిరుత్తణి సుబ్రమణ్యస్వామికి సారె సమర్పించారు.