తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త.. క్యూలైన్‌లలో ఆ సమస్యకు చెక్, నో టెన్షన్

తిరుమలలో భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొండపై రింగురోడ్డులో సర్వదర్శనం క్యూలైన్ల నిర్మాణం వేగవంతం అయ్యింది. తిరుమలలో గత ఐదారునెలలుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయిన భక్తులను రింగురోడ్డు మీదుగా ఆక్టోపస్‌ భవనం వరకు నిర్మించిన తాత్కాలిక క్యూలైన్లలో పంపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో ఫ్యాన్‌లు, లైట్లు లేకపోవడం, వర్షం పడితే భక్తులు తడిసిపోతుండటం, మార్గంలో తాత్కాలిక మరుగుదొడ్లు సరిపోవడం లేదు. అందుకే టీటీడీ శాశ్వత ప్రాతిపదికన క్యూలైన్ల నిర్మాణం ప్రారంభించింది.. మూడు నెలల క్రితం ఈ పనులు ప్రారంభించగా ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. మొదటి దశలో శిలాతోరణం కూడలి వరకు నిర్మాణం జరుగుతోంది. త్వరలోనే ఈ పనులు పూర్తి చేయాలని భావిస్తోంది.

ఆగష్టు 16న నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం

తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఆగష్టు 16వ తేదీన ఛత్రస్థాపనోత్సవం జ‌రుగ‌నుంది. ఈ సందర్భంగా అర్చక బృందం శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏడాదికోసారి ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు మొదటగా కాలు మోపినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా శ్రావణ శుద్ధ ద్వాదశినాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహిస్తారు.

ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టిస్తారు. ఛత్రస్థాపనోత్సవం కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతోంది. ఇందులో భాగంగా నారాయణగిరిలోని శ్రీవారి పాదాలకు తిరుమంజనానికి నిర్వహించేందుకు ఆలయంలోని బంగారు బావి నుండి తీర్థాన్ని తీసుకుంటారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో రెండవ గంట తర్వాత పూజ సామాగ్రి, పుష్పాలు, నైవేద్యానికి ప్రసాదాలు సిద్ధం చేసుకుంటారు. రంగనాయకుల మండపం నుండి గొడుగులతో మంగళవాయిద్యాల నడుమ మహాప్రదక్షిణంగా మేదరమిట్ట చేరుకుంటారు. అక్కడి నుంచి అర్చకులు నారాయణగిరి శిఖరం చేరుకుని బంగారుబావి నుండి తెచ్చిన తీర్థంతో శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, అలంకారం, పూజ, నైవేద్యం సమర్పిస్తారు. తదనంతరం వేదపారాయణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించి, శ్రీవారి పాదాల చెంత గొడుగును ప్రతిష్టించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు.

కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్స‌వాలు

కార్వేటినగరంలోని రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగ‌స్టు 17 నుండి 19వ తేదీ వ‌ర‌కు తెప్పోత్స‌వాలు వైభవంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా మొద‌టి రోజు ఆగ‌స్టు 17న శ్రీ సీతాల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ కోదండ‌రామ‌స్వామివారు, ఆగ‌స్టు 18, 19వ తేదీల్లో శ్రీ రుక్మిణి, స‌త్య‌భామ స‌మేత శ్రీ వేణుగోపాల‌స్వామివారు సాయంత్రం 6 నుంచి 7.30 గంలకు తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ మూడు రోజుల పాటు ఉద‌యం 9.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్స‌వం నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఆధ్యాత్మిక‌, భక్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *