పారిస్‌ ఫైనల్‌ మెడల్స్ లిస్ట్‌.. టాప్‌లో అమెరికా, భారత్‌ కంటే మెరుగైన స్థానంలో పాకిస్థాన్..!

పారిస్‌ 2024 ఒలింపిక్స్‌లో క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. మొత్తంగా సుమారు రెండు వారాల పాటు సాగిన ఈ పోటీలు క్రీడాభిమానులను ఉర్రూతలూగించాయి. అయితే భారత ఫ్యాన్స్‌కు మాత్రం మిశ్రమ అనుభూతులను అందించాయి. మను భాకర్‌ తొలి మెడల్‌ సాధించి జోష్‌ నింపింది. అయితే బ్యాడ్మింటన్, ఆర్చరీ, అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారులు నిరాశ పరిచారు. మరికొందరు పతకాన్ని తృటిలో చేజార్చుకున్నారు. మొత్తంగా పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌ 6 పతకాలు సాధించింది. అయితే పతకాల పట్టికలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో చైనాకు చోటు దక్కింది.

పారిస్ 2024 ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన దేశాలు..

ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ఆ జట్టు అథ్లెట్లు ఏకంగా 40 స్వర్ణ పతకాలను కొల్లగొట్టారు. రజత పతకాలు 44, కాంస్య పతకాలు 42 సాధించారు. దీంతో మొత్తంగా అమెరికా 126 పతకాలను కైవసం చేసుకుంది. రెండో స్థానంలో ఉన్న చైనా సైతం అమెరికాతో సమానంగా 40 స్వర్ణ పతకాలు గెలుచుకుంది. 27 రజత పతకాలు, 24 కాంస్య పతకాలతో మొత్తంగా 91 పతకాలు సాధించింది. దీంతో రెండో స్థానంలో నిలిచింది. పతకాలను పట్టికను ఆయా దేశాలు సాధించిన స్వర్ణ పతకాల ఆధారంగా డిసైడ్‌ చేస్తారు..

ఈ జాబితాలో జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్, గ్రేట్ బ్రిటన్‌, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇటలీ, జర్మనీలో టాప్‌-10లో చోటు దక్కించుకున్నాయి. జపాన్‌ 20 స్వర్ణ పతకాలతో కలిపి.. 45 మెడల్స్‌ సాధించింది. ఆస్ట్రేలియా 18 గోల్డ్ మెడల్స్‌తో సహా మొత్తం 53 పతకాలు.. ఫ్రాన్స్‌ 16 స్వర్ణ పతకాలతో కలిపి టోటల్‌గా 64 మెడల్స్ కైవసం చేసుకుంది. నెదర్లాండ్స్‌ 15 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 34 మెడల్స్‌ సొంతం చేసుకుంది. గ్రేట్‌ బ్రిటన్ 14 గోల్డ్‌ మెడల్స్‌తో సహా మొత్తంగా 65, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా 13 స్వర్ణాలతో కలిపి 32, ఇటలీ 12 స్వర్ణాలతో కలిపి 40, జర్మనీ 12 పసిడి పతకాలతో సహా 33 మెడల్స్‌ ఖాతాలో వేసుకుంది.

ఇక భారత్‌ ఆరు పతకాలు సాధించి.. ఈ పట్టికలో 71వ స్థానంలో నిలిచింది. ఆ జాబితాలో మన దాయాది దేశం పాకిస్థాన్‌ మన కంటే మెరుగైన స్థానంలో నిలిచింది. ఆ దేశ జావెలిన్ త్రోయర్‌ అర్షద్‌ నదీమ్ గోల్డ్ మెడల్‌ సాధించడంతో పాకిస్థాన్ పతకాల పట్టికలో 62వ ప్లేసులో నిలిచింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆ దేశం సాధించిన ఏకైక పతకం ఇదే. భారత్‌ తరఫున నీరజ్‌ చోప్రా అత్యుత్తమంగా రజత పతకం సాధించాడు. మను భాకర్ వ్యక్తిగతంగా ఒక కాంస్యం, సరబ్జోత్ సింగ్‌తో కలిసి మరో పతకం సాధించింది. షూటర్‌ స్వప్నిల్ కుశాలే, రెజ్లర్‌ అమన్ సెహ్రావత్‌లు సైతం కాంస్య పతకాలు సాధించారు. పురుషుల హాకీ జట్టు సైతం కాంస్యం కొల్లగొట్టింది. ఇక వినేష్‌ ఫొగాట్‌కు అనుకూలంగా తీర్పు వస్తే భారత్‌ ఖాతాలో మరో రజత పతకం చేరనుంది.

About rednews

Check Also

భారత్ 46 ఆలౌట్.. సొంత గడ్డపై అత్యల్ప స్కోరు.. కివీస్ పేసర్ల ధాటికి విలవిల్లాడిన బ్యాటర్లు..!

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత జట్టు కుప్పకూలింది. పేకమేడను తలపిస్తూ.. భారత బ్యాటర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *