విజయవాడ కోసం మేమున్నామని.. విశాఖ జీవీఎంసీకి సెల్యూట్

విజయవాడకు వచ్చిన కష్టాన్ని చూసి యావత్ రాష్ట్రం చలించిపోయింది. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా తోడ్పాటును అందిస్తున్నారు.. బెజవాడకు అండగా ఉంటామని భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడకు సాయాన్ని అందిస్తున్నారు. రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, చిరు వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు వదర బాధితులకు అవసరమైన ఆహారం, కూరగాయలు, మంచినీళ్లు, పండ్లు, మందులు అందిస్తున్నారు. అయితే విజయవాడలో వరద ప్రభావం మెల్లిగా తగ్గిపోతోంది.. కొన్ని ప్రాంతాల్లో వరద పోయి బురద మిగిలింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. బురదను తొలగించే పనుల్ని ముమ్మరం చేయాలని భావిస్తోంది.

విజయవాడకు మేమున్నామంటూ విశాఖపట్నం జీవీఎంసీ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు ముందుకొచ్చారు. వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడానికి మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్‌ పి.సంపత్‌కుమార్‌ అధికారుల్ని, కార్మికుల్ని పంపించారు. వీరంతా విశాఖపట్నం నుంచి మంగళవారం సాయంత్రం విజయవాడకు బయల్దేరారు.. మొత్తం 1400 మంది పారిశుద్ధ్య కార్మికులు 29 బస్సుల్లో తరలి విజయవాడకు వెళ్లారు. అదనపు కమిషనర్‌ ఎస్‌ఎస్‌ వర్మ, ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ నరేష్‌కుమార్, 16 మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఏడుగురు ఇంజినీర్లు, 8మంది సహాయ ఇంజినీర్లు విజయవాడకు వెళ్లారు. ఏడు తాగునీటి ట్యాంకర్లను కూడా వెంట తీసుకెళ్లారు.

మరోవైపు మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘ సమావేశాన్ని రద్దు చేశారు. కమిషనర్‌తోపాటు, అధికారులు విజయవాడ వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లడంతో బుధవారం జరగాల్సిన ఈ సమావేశాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని కార్యదర్శి ఎంవీడీ ఫణిరాం తెలిపారు. తదుపరి సమావేశం ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామన్నారు. విజయవాడ ప్రజల కష్టాలను చూసి విశాఖపట్నం నుంచి వెళ్లిన పారిశుద్ధ్య కార్మికులు, అధికారుల్ని అందరూ ప్రశంసిస్తున్నారు. విశాఖ జీవీఎంసీ మాత్రమే కాదు.. ఇతర నగరాలు, పట్టణాల నుంచి కూడా అవసరమైన మేరకు పారిశుద్ధ్య కార్మికుల్ని విజయవాడకు పంపించే పనిలో ఉన్నారు అధికారులు. ఆయా నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు పెండింగ్‌ పడకుండా.. అవసరమైన మేరకు అక్కడే ఉంచుకుని.. మిగిలిన వారిని విజయవాడ పంపించే పనిలో ఉన్నారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *