Dana Cyclone: ఏపీపై దానా తుఫాన్‌పై ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుఫాన్‌గా బలపడి హబాలిఖాతి నేచర్ క్యాంప్‌ (భిత్తర్కనిక)-ధమ్రాకు సమీపంలో తీరం దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుఫాన్ గురువారం అర్ధరాత్రి తర్వాత 1:30 నుంచి తెల్లవారుజాము 3:30గంటల మధ్యతీరం దాటింది. ఇది పశ్చిమ-వాయువ్యదిశగా కదులుతూ శుక్రవారం మధ్యాహ్నం వరకు క్రమంగా బలహీనపడుతుందన్నారు.. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయంటున్నారు.ఉత్తరాంధ్ర జిల్లాలపై తుఫాన్ ప్రభావం లేకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గురువారం రాత్రి 9 గంటల వరకు శ్రీకాకుళం జిల్లాలో తేలికపాటి జల్లులు మినహా ఎక్కడా వానలు పడలేదు. మరోవైపు రాబోయే మూడురోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

మరోవైపు అనంతపురం జిల్లాలో సోమవారం కురిసిన భారీ వర్షాల దెబ్బకు పలు కాలనీలు నీటమునిగాయి. వరద దెబ్బకు రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి చెరువుకు గండిపడింది. అలాగే అనంతపురంలోని పండమేరు వంకకు పెద్ద ఎత్తున వరద రావడంతో అనంతపురం రూరల్ పరిధిలోని అంబేడ్కర్ కాలనీ, కళాకారుల కాలనీ, ఉప్పరపల్లి సమీపంలోని ఇందిరమ్మ కాలనీ, జగనన్న కాలనీలు నీట మునిగాయి.

మరోవైపు దానా తుఫాన్ దెబ్బకు ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ మేరకు బాలేశ్వర్, భద్రక్, కేంద్రపడ, జగత్‌సింగ్‌పుర్‌ జిల్లాలకు వాతావరణశాఖ రెడ్‌ ఎలర్ట్‌ జారీ చేశారు. భువనేశ్వర్, కోల్‌కతా విమానాశ్రయాలను శుక్రవారం ఉదయం వరకు మూసివేశారు. గురువారం పశ్చిమబెంగాల్‌లో భారీవర్షాలతో ఈదురుగాలులు వీచాయి. ఈ తుఫాన్ ప్రభావంతో రైళ్లు కూడా రద్దు చేశారు. ఈ నెల 27వ తేదీ వరకు దాదాపు 400 రైలు సర్వీసులను రద్దయ్యాయి. అటు జార్ఖండ్‌లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *