బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

ఏపీలో మళ్లీ వానలు మొదలయ్యాయి. గత రెండు రోజులుగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న అల్పపీడనం కారణంగా వర్షాలు పడుతున్నాయి. అయితే పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఈ అల్పపీడనం బలహీనపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కోస్తాంధ్ర జిల్లాలలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల మంగళవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు తెలంగాణలోను ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, హైదరాబాద్‌ జిల్లాలలో వర్షం కురుస్తోంది.

మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, కోనసీమ ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా , గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అటు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

మరోవైపు ఉరుములు, మెరుపులతో పాటుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో పొలాల్లో పనిచేసేవారు, కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అలాగే వర్షాలు కురిసే సమయంలో.. బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని చెబుతోంది. పాడుబడిన భవనాలు, విద్యుత్ స్థంభాలకు దూరంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు జాగ్రత్తలు చేసింది. సముద్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో.. మత్స్యకారులు, చేపలవేటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *