జీతం కోసం ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే.. ఉద్యోగం నుంచి తీసేశారు..!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి ‘ప్రజావాణి’ కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే సీఎం రేవంత్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజాభవన్‌కు వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులకు మెుర పెట్టుకుంటున్నారు. ఇలాగే ఓ మహిళా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని కూడా తన జీతం విషయంపై ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే జీతం విషయం దేవుడెరుగు ఉద్యోగమే తీసేశారని సదరు మహిళ వాపోయింది

వివరాల్లోకి వెళితే.. మేడ్చల్‌ జిల్లాకు చెందిన రేణుక హైదరాబాద్‌లో కుటుంబంతో సహా నివాసం ఉంటోంది. నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ఔట్‌ సోర్సింగ్ విధానంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తుంది. అయితే ఆమె జీతం రూ.15 వేలు కాగా.. ఏజెన్సీ మాత్రం వేతనంలో కోత పెట్టి రూ.10 వేలు మాత్రమే ఇస్తుందని రేణుక ఆరోపిస్తుంది. ఈ మేరకు తమకు న్యాయం చేయాలంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అయినా పైనుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ప్రజా భవన్‌కు చేరుకొని ప్రజావాణిలో తమకు జరగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఏజెన్సీ ఆ మరుసటి రోజే రేణుకను ఉద్యోగం నుంచి తీసేసింది. ప్రజావాణిలో ఫిర్యాదు చేయటంతో ఆమెకు ఉద్వాసన పలికారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన రేణుక మంగళవారం సాయంత్రం ప్రజాభవన్‌‌కు చేరుకొని అధికారులకు తన గోడును వెళ్లబోసుకుంది. తన ఉద్యోగం తిరిగి ఇప్పించాలని కోరింది.

ఈ ఘటనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతం రావడం లేదని ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారా అని మండిపడ్డారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన అని ఎద్దేవా చేశారు. రేణుకను ఉద్యోగంలో నుంచి తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ శాంతి కుమారిని డిమాండ్‌ చేశారు. జీతం రావటం లేదని అడిగితే ఉద్యోగం పీకేశారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసినందుకు ప్రభుత్వం నిర్ణయం. ఆర్భాటం ఎక్కువ, పరిష్కారం తక్కువ. ప్రజాపాలన కాదు.. ఇది ప్రతీకార పాలన. రేణుక గారిని ఉద్యోగంలోంచి తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అని తెలంగాణ సీఎంవోను ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేసారు.


About rednews

Check Also

హైదరాబాద్‌లో భారీగా కుంగిన రోడ్డు.. పెద్ద ప్రమాదమే తప్పింది.. 200 మీటర్ల దూరంలోనే..!

హైదరాబాద్‌లోని గోషామహల్‌లో రోడ్డు భారీగా కుంగిపోయింది. మంగళవారం (అక్టోబర్ 22న) రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *