హైదరాబాద్లోని గోషామహల్లో రోడ్డు భారీగా కుంగిపోయింది. మంగళవారం (అక్టోబర్ 22న) రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల సమయంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. గోషామహల్లో దారుసలామ్ నుంచి చాక్నావాడికి వెళ్లే మార్గంలో ప్లైవుడ్ దుకాణాల ముందు రోడ్డు భారీగా కుంగిపోయింది. రోడ్డు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కుప్పకూలిపోయింది. అయితే.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరుగుతుండటంతో.. అక్కడ ప్రజలు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. సీవరేజ్ పెద్ద నాలా అతిపూరాతనమైనదని స్థానికులు చెప్తున్నారు. అయితే.. ప్రస్తుతం కుంగిన ప్రదేశానికి 200 మీటర్ల దూరంలోనే.. గతంలో కూడా రోడ్డు కుంగిపోయిందని చెప్పుకొచ్చారు.
2022 డిసెంబర్లోనూ ఈ మార్గంలో నాలా కూలిపోయి.. డ్రైనేజీలో కుప్పకూలిన ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో.. రోడ్డుపై నిలిపి ఉంచిన కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలన్ని నాలాలో పడిపోయాయి. నాలాపై ఉన్న కూరగాయలు, పూల దుకాణాలు కూడా నాలాలో కూలిపోయాయి. ఈ ఘటనలో పలువురు అందులో పడిపోయి గాయపడ్డారు కూడా.
అయితే.. ఇప్పుడు రోడ్డు కుంగిపోయిన ప్రాంతం కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. అక్కడే ఫ్లైవుడ్ దుకాణాలు ఉండటంతో.. నిత్యం జనసంచారంతో పాటు వాహనాలు కూడా తిరుగుతూ ఉంటాయి. అయితే.. పగటి పూట ఈ ఘటన జరిగి ఉంటే మాత్రం పెద్ద ఎత్తున ప్రమాదం చోటుచేసుకునేదని స్థానికులు చెప్తున్నారు. కాగా.. ప్రస్తుతం రోడ్డు కుంగిపోవటం కూడా సరిగ్గా షెటర్ల ముందు వరకు కూలిపోతుండటం గమనార్హం.