బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపించిన నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ తనకు లీగల్ నోటీసు పంపినట్లు మీడియాలో చూశానని తెలిపిన బండి సంజయ్.. లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందన్నారు. తనపై మొదట కేటీఆరే వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించినట్టు పేర్కొన్నారు సంజయ్. అందుకు బదులుగానే తాను మాట్లాడినట్టు తెలిపారు.
“కేటీఆర్ సుద్దపూస అనుకుంటున్నాడేమో. ఆయన భాగోతం ప్రజలకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదులిచ్చాను. ఇక.. లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదులిస్తా. మేం చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తులం. చట్టం, న్యాయం ప్రకారం కూడా ముందుకు వెళతాం.” అంటూ బండి సంజయ్ సమాధానం ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ తనపై నిరాధారమైన, తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన నిరాధారమైన వ్యాఖ్యలకు వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ నెల 19 వ తేదీన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ నోటీసులో పేర్కొన్నారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్టుగా బండి సంజయ్ ఆరోపణలు చేశారు.
బండి సంజయ్ చేసిన ఆరోపణలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన చేసిన నిరాధరమైన కామెంట్లను నోటీసులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి కేసీఆర్ పేరును కూడా తీశారని చెప్పారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని నోటీసులో తెలిపారు. కేవలం తనను అప్రతిష్ట పాలు చేయాలన్న దురుద్దేశతంతోనే బండి సంజయ్ వ్యాఖ్యలు ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా తన పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని కేటీఆర్ హెచ్చరించారు