ఏపీ అసెంబ్లీలో గురువారం ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. సీరియస్‌గా మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలతో సభలో నవ్వులు విరిశాయి. అంతేకాదు సభలోని మెజారిటీ సభ్యులు లేచి నిల్చోవాల్సి వచ్చింది. చంద్రబాబు మాటతో వారంతా లేచి నిల్చోవాల్సి వచ్చింది. అసలు ఎందుకు ఇలా జరిగిందనే సంగతికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు అనే అంశం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వైసీపీ పాలనలో ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని ఆరోపించారు. అలాగే ప్రజలు కూడా శారీరకంగా, మానసికంగా కుంగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే విపక్ష నేతలపైనా అప్పటి వైసీపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టిందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీనిని సభలోని సభ్యులు అందరికీ తెలియజేసేలా చంద్రబాబు చేసిన పని.. సభలో నవ్వులు పూయించింది. కేసులు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఒక్కసారి సీట్లలో నుంచి లేచి నిల్చోవాలంటూ చంద్రబాబు సూచించారు. దీంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహా మెజారిటీ ఎమ్మెల్యేలు లేచి నిల్చున్నారు. దీంతో సభలో సభ్యులు అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. వైసీపీ విధానాలపై రాజకీయంగా పోరాడిన అందరి మీద అప్పటి వైసీపీ ప్రభుత్వం పోలీసుల సాయంతో కేసులు పెట్టించిందని చంద్రబాబు విమర్శించారు. ఎప్పటికీ బయటకు రానివ్వకూడదని అనుకున్నారని.. కానీ జనమే ఓట్లేసి అసెంబ్లీకి పంపారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలోనే వైసీపీ పాలనలో తనపై 17 కేసులు పెట్టారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో బాబ్లీ కేసు తప్ప తనపై మరో కేసు లేదని.. కానీ వైసీపీ హయాంలో తనపై 17 కేసులు నమోదైనట్లు చంద్రబాబు చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ మీద ఏడు కేసులు పెట్టారన్న చంద్రబాబు.. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఏకంగా 60 కేసులు పెట్టారని గుర్తు చేశారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపైనా అధిక సంఖ్యలో కేసులు నమోదైనట్లు చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందన్న చంద్రబాబు.. పోలీసులను ఆయుధంగా చేసుకుని రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఇదే సమయంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు విషయాన్ని సైతం చంద్రబాబు ప్రస్తావించారు. ఆయనను లాకప్‌లో పెట్టి చిత్రహింసలకు గురిచేశారన్నారు. ఇక టీడీపీ ప్రభుత్వం హయాంలోనే రాయలసీమలో ఫ్యాక్షనిజం పోగొట్టామన్న చంద్రబాబు.. టీడీపీ తీసుకున్న చర్యల కారణంగానే గతంలో హైదరాబాద్‌లో మత ఘర్షణలు తగ్గాయని వివరించారు.