YSRCP Office Demolished in Eluru: ఏలూరులో వైసీపీ కార్యాలయం కూల్చివేత వ్యవహారంపై మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కీలక విషయాలు వెల్లడించారు. ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్ష పదవితో పాటుగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి పదవికి కూడా ఆళ్ల నాని రాజీనామా చేశారు. తాజాగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశం నిర్వహించిన ఆళ్ల నాని.. కీలక విషయాలు వెల్లడించారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానన్న ఆళ్ల నాని.. ఇక వ్యక్తిగతంగా అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. వ్యక్తిగత కారణాలతోనే రాజకీయాలకు, పార్టీకి రాజీనామా చేసినట్లు ఆళ్ల నాని చెప్పుకొచ్చారు.
వైసీపీ కార్యాలయం కూల్చివేత విషయంలోనూ ఎలాంటి అపోహలు వద్దని ఆళ్ల నాని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయం లీజుకు ఇచ్చిన వ్యక్తి.. అమెరికాలో ఉంటారని చెప్పారు. రవిచంద్ర అనే తన స్నేహితుడు పార్టీ కార్యాలయానికి స్థలం లీజుకు ఇచ్చారన్నారు. రాజకీయ పార్టీ ఆఫీసు అంటే స్థలం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రారన్న ఆళ్లనాని.. తన అభ్యర్థన మేరకు రెండేళ్ల పాటు లీజుకు ఇచ్చారన్నారు. 2017లో ఆ స్థలం లీజుకు తీసుకున్నామని.. ఆ తర్వాత అక్కడే తాత్కాలిక నిర్మాణాలు చేపట్టినట్లు వివరించారు. అయితే గతేడాది ఆ స్థలం తిరిగివ్వాలని యజమాని కోరినట్లు ఆళ్లనాని చెప్పారు.
స్థల యజమాని స్థలాన్ని తిరిగివ్వాలని కోరిన విషయాన్ని వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్‌గా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి గతేడాదే తెలియజేసినట్లు ఆళ్లనాని వెల్లడించారు. అయితే ఎన్నికలకు మూడు నెలల ముందు స్థలం వెనక్కి ఇచ్చేయాలని మిథున్ రెడ్డి చెప్పారన్న ఆళ్లనాని.. ఎన్నికల సమయంలో పార్టీ ఆఫీసు తీసివేయడం మంచి పద్ధతి కాదని ఆగిపోయినట్లు చెప్పారు. అయితే 15 రోజుల క్రితమే స్థలాన్ని హ్యాండోవర్ చేయాలని పార్టీ నాయకులు నిర్ణయం తీసుకున్నారని.. ఆ మేరకు ఆగస్ట్ ఒకటో తేదీ స్థలాన్ని హ్యాండోవర్ చేసినట్లు చెప్పారు. అయితే ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్థలం యజమాని అనుమతి తీసుకుని కార్యక్రమం నిర్వహించామన్నారు. ఆగస్ట్ 16న స్థలాన్ని పూర్తిస్థాయిలో యజమానికి అప్పగించామని.. డెవలప్మెంట్ కోసం ఆయన పనులను ప్రారంభించారన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.