Stock Market Live Updates: సెబీ ఛైర్‌పర్సన్ మాధబి బచ్, ఆమె భర్తపై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ కంపెనీలకు చెందిన షేర్ల విలువల్ని కృత్రిమంగా పెంచేందుకు దోహదపడిన అంతర్జాతీయ ఫండ్లలో స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఛైర్‌పర్సన్ దంపతులకు వాటాలున్నాయని ఈ సంస్థ ఆరోపించింది. వీటిని ఇరువురూ ఖండించారు. ఆరోపణలు అర్థరహితమని కొట్టిపారేశారు. అయినప్పటికీ హిండెన్‌బర్గ్ ఆరోపణల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. సూచీలు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. సోమవారం సెషన్ ఆరంభంలో 400 పాయింట్లకుపైగా పడిపోయిన సూచీలు.. తర్వాత మెల్లగా కోలుకున్నాయి.
ప్రస్తుతం వార్త రాసే సమయంలో ఫ్లాట్‌గా ఉన్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 79 వేల 700 మార్కు దగ్గర.. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 24 వేల 350 మార్కుకు దగ్గర్లో ఉంది. అయితే మార్కెట్లు ఆరంభంలో భారీ నష్టాల్లో ఉన్నప్పటికీ.. కిందటి వారం ఆఖరి సెషన్లో లిస్టింగ్ అయిన ఓలా స్టాక్ దూసుకెళ్లింది.
ఇవాళ ఆరంభంలోనే ఈ షేరు 6 శాతానికిపైగా పెరగ్గా.. తర్వాత చాలా వరకు 15 శాతానికిపైగా ట్రేడయింది. ఇక ఈ వార్త రాసే సమయంలో 20 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టి రూ. 109.44 వద్ద స్థిరపడింది. దీంతో ఇన్వెస్టర్లకు కాసుల పంట పండుతోందని చెప్పొచ్చు.
ఆగస్ట్ 9నే స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ.. ఆరోజు మాత్రం తొలుత ఫ్లాట్ లిస్టింగ్ అంటే ఇష్యూ ధర రూ. 76 దగ్గరే లిస్టింగ్ అయినప్పటికీ.. తర్వాత పుంజుకుంది. దీంతో శుక్రవారం రోజు ఆఖరికి 20 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ. 91.20 వద్ద సెషన్ ముగించింది. మళ్లీ ఇవాళ కూడా 20 శాతం పెరగడంతో రెండు సెషన్లలోనే ఇది 40 శాతం పెరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ. 48.27 వేల కోట్లుగా ఉంది. ఆగస్ట్ 14న భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని ఈ ఓలా కంపెనీ.. తొలి త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించనుంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ షేర్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
గత కొంత కాలంగా చాలా ఐపీఓలు లిస్టింగ్‌తోనే మంచి రిటర్న్స్ ఇచ్చినప్పటికీ.. ఓలా ఎంట్రీ ఇచ్చిన సమయంలో మాత్రం స్టాక్ మార్కెట్లు కరెక్షన్‌కు గురయ్యాయి. లాభాల్ని సొమ్ముచేసుకునేందుకు షేర్లను అమ్మేశారు. ఈ క్రమంలో భారీ డిమాండ్ ఉన్నప్పటికీ ఓలా స్టాక్ మాత్రం ఫ్లాట్ ఎంట్రీ ఇచ్చింది.