Ola Incred Loan: మీకు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం పడిందా.. మీ చేతిలో లేవా.. అప్పుడేం చేస్తారు. స్నేహితుల్నో, బంధువుల్నో అడుగుతుంటారు. అక్కడ కూడా లేకుంటే చాలా మంది ఎంచుకునే ఆప్షన్.. బ్యాంకులు. అవును బ్యాంకుల్లో పర్సనల్ లోన్ తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక్కడ కొన్ని సార్లు పని ఈజీగా కాకపోవచ్చు. వడ్డీ రేట్లు నచ్చకపోవడం.. ఈఎంఐ ఎక్కువ కట్టాల్సి రావడం.. లేదా మీకు లోన్ వచ్చే అర్హత లేకపోవడం.. సిబిల్ స్కోరు తక్కువగా ఉండటం వంటి కారణాలతో తిరస్కరణకు గురి కావొచ్చు. ఇంకా కొన్ని సార్లు లోన్ కోసం చాలా డాక్యుమెంట్స్ సమర్పించాల్సి వస్తుంది. ఈ కారణంతో లోన్ వచ్చేందుకు కూడా చాలానే టైం పట్టొచ్చు.
అయితే ఇలాంటి వారి కోసమే ఇబ్బందులు లేకుండా కొంత కాలంగా ఇతర థర్డ్ పార్టీ యాప్స్ కూడా లోన్ ఆఫర్ చేస్తున్నాయి. అవి ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో జట్టుకట్టి లోన్లు అందిస్తున్నాయి. ఇప్పుడు ఓలా కూడా అదే పని చేస్తుంది. మీరు ఓలా యాప్ వాడుతున్నట్లయితే అందులోనే లోన్ తీసుకునే వెసులుబాటు ఉంది.
ఓలా యాప్ ద్వారా గరిష్టంగా రూ. 10,00,000 (రూ. 10 లక్షలు) వరకు కూడా రుణం పొందొచ్చు. దీనిని ఓలా యాప్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా ఈజీనే. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఇన్‌క్రెడ్ ఫైనాన్స్.. ఇప్పుడు ఓలా మనీతో పార్ట్నర్షిప్ ఏర్పరుచుకుంది. ఇక్కడ ఓలా యూజర్లు సులభంగానే రుణం పొందొచ్చు.
ఓలా- ఇన్‌క్రెడ్ ఈ లోన్ కోసం ఎలాంటి డాక్యుమెంట్లు అడగదు. ఇక వడ్డీ రేట్లు నెలకు 1.16 శాతం నుంచి ప్రారంభం అవుతున్నాయి. కాల వ్యవధి, ఈఎంఐ ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ఇది 100 శాతం డిజిటల్ లోన్ అని అందులో చూడొచ్చు. రుణ గ్రహీతల యోగ్యతను బట్టే లోన్ అమౌంట్ మారుతుంటుంది. ఓలా యాప్ ఓపెన్ చేయగానే.. కింద 5 ఆప్షన్లలో లాస్ట్‌లో లోన్స్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసి.. సరిగ్గా చదువుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకోవచ్చు.