తిరుమల డిక్లరేషన్ అంటే ఏంటి.. టీటీడీ నిబంధన ఇదే, జగన్‌‌ నుంచి డిక్లరేషన్‌ కోరనున్న అధికారులు?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన పొలిటికల్ హీట్ పెంచింది. ఆయన శ్రీవారి దర్శనానికి వెళుతుండటంతో డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. టీటీడీ కూడా నిబంధనల ప్రకారం.. శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్‌ కోరినట్లే మాజీ సీఎం జగన్‌ నుంచీ తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తిరుమలో జగన్ బస చేసే గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్లి.. ముందుగానే ఆయనకు డిక్లరేషన్‌ ఫారాన్ని అందించనున్నారు. ఆయన సంతకం చేస్తే దర్శనానికి అనుమతించనున్నారు.. ఒకవేళ తిరస్కరిస్తే దేవాదాయశాఖ చట్టప్రకారం నడుచుకుంటామని టీటీడీ చెబుతోందట.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. డిక్లరేషన్‌పై సంతకం పెట్టకపోతే దర్శనానికి అనుమతిస్తారా లేదా అన్నది చూడాలి. చట్ట ప్రకారం అయితే దర్శనానికి అనుమతించరని చెబుతున్నారు.

తిరుమలకు అన్యమతస్థులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు కచ్చితంగా అఫిడవిట్‌ సమర్పించాలని టీటీడీ నిబంధనలు చెబుతున్నాయి. దేవాదాయశాఖ చట్టం 30/1987ని అనుసరించి 1990లో అప్పటి ప్రభుత్వం ఒక జీవోను తీసుకొచ్చింది. ఈ నిబంధనను అనుసరించి హిందువులు కాని వ్యక్తులు/అన్యమతస్థులు.. తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలంటే ముందుగా డిక్లరేషన్‌ ఫారంపై సంతకం పెట్టాల్సి ఉంటుంది. తాను వేరే మతానికి సంబంధించిన వ్యక్తినని.. అయినా శ్రీవేంకటేశ్వరస్వామిపై నమ్మకం, గౌరవం ఉన్నందున తనను దర్శనానికి అనుమతించాలని కోరుతూ వివరాలు పొందుపరిచి, సంతకం చేయాల్సి ఉంటుంది. గతంలో సోనియా గాంధీ, ఏపీజే అబ్దుల్ కలాంతో పాటూ పలువురు ప్రముఖులు సైతం డిక్లరేషన్ సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

తిరుమల వచ్చే అన్యమతస్థుల్లో సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు 17వ కంపార్ట్‌మెంటు దగ్గర డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. వీఐపీలు వచ్చినప్పుడు అధికారులే గెస్ట్‌హౌస్ దగ్గరకు వెళ్లి సంతకాలు తీసుకుంటారు. జగన్‌ శుక్రవారం తిరుమల వస్తే గెస్ట్‌హౌస్‌ దగ్గరకు వెళ్లి టీటీడీ నిబంధనలు, దేవాదాయశాఖ చట్టంలోని అంశాలను ఆయనకు వివరించి డిక్లరేషన్‌పై సంతకం కోరనున్నట్లు తెలుస్తోంది. దీంతో వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఆసక్తికరంగా మారింది.

గత వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో జగన్‌ పలు సందర్భాల్లో శ్రీవారి దర్శనానికి వచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండటంతో.. టీటీడీ ఆయన్ను డిక్లరేషన్‌ కోరలేదు. ఈ అంశాన్ని గత ఐదేళ్లు హిందూసంఘాలు, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ప్రస్తావించారు.. జగన్ కూడా డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడు సీఎం కాబట్టి ఎవరూ డిక్లరేషన్ అడగలేదని.. ఇప్పుడు మాత్రం డిక్లరేషన్‌పై సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతించాలని కూటమి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
అలాగే జగన్‌ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని తిరుపతి బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి చెబుతున్నారు. హిందువులకు క్షమాపణ చెప్పిన తర్వాత తిరుమలకు వెళ్లేందుకు జగన్‌ అర్హుడన్నారు.

మరోవైపు వైఎస్ జగన్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. జగన్ ఇవాళ సాయంత్రం 4.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు బయల్దేరి రాత్రి 7 గంటలకు కొండపైకి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బసచేసి.. శనివారం ఉదయం 10.30 గంటలకు తిరుమల ఆలయానికి వెళ్తారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. అనంతరం 11.30 గంటలకు ఆలయం నుంచి గెస్ట్‌ హౌస్‌కు బయలుదేరుతారు. ఆ తరువాత 11.50 గంటలకు తిరుమల నుంచి రేణిగుంటకు వెళతారు. 1.20 గంటలకు రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి 1.30 గంటలకు రేణిగుంట నుంచి బెంగళూరులోని తన నివాసానికి జగన్ వెళతారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *