జమ్మూ కశ్మీర్‌లో ముష్కర మూకల కోసం గాలిస్తుండగా.. ఓ సైనికాధికారి అమరుడయ్యాడు. దోడా జిల్లాలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అస్సార్ అలీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో 48వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఓ ఆర్మీ కెప్టెన్ వీరమరణం పొందాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతుంది. శివ్‌గఢ్-అస్సార్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం రావడంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. మంగళవారం రాత్రి ఆ ప్రాంతానికి చేరుకుని గాలిస్తుండగా.. సైన్యంపై తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్‌కు దారితీసింది.
ఘటనా స్థలిలో అమెరికాలో తయారైన అత్యాధునిక ఎం-4 రైఫిల్‌ను స్వాధీనం చేసుకొన్నాయి. వీటితోపాటు మూడు బ్యాక్‌ప్యాక్ బ్యాగ్‌లను గుర్తించారు. అమెరికా తయారీ ఎం4 కార్బైన్‌ను ఇటీవల కాలంలో ఉగ్రవాదులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. నాటో దళాలు వినియోగించే M16A2Aకు ఇది తేలికపాటి రకం. 2.5 కేజీల బరువు ఉంటుంది. పొట్టి బ్యారెల్‌తో వేగంగా కదలడానికి అనువుగా ఉంటాయి. బిలియన్ డార్ల విలువైన ఈ ఆయుధాలను 2021లో అఫ్ఘనిస్థాన్‌ను వీడిన సమయంలో అమెరికా, నాటో దళాలు వదిలి వెళ్లిపోయాయి. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌లు.. వీటి తాలిబన్ల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. కొన్నాళ్లుగా పాక్ మీదుగా ఇవి కశ్మీర్‌లోకి చేరుతున్నాయి.