ఎల్ఆర్ఎస్‌ కొత్త విధివిధానాలు.. రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం..!

తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన “లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం”(LRS) అమలుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలపై తీవ్ర భారం పడనుందంటూ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో విమర్శించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త విధివిధానాలు (LRS Guidelines) తీసుకురావాలని యోచిస్తోంది. ఈ మేరకు.. ఎల్‌ఆర్‌ఎస్‌ అమలుపై సచివాయలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఎల్ఆర్‌ఎస్ విధివిధానాల‌ కసరత్తుపై సమీక్షించారు. ఎల్‌ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని అధికారులకు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఎల్ఆర్ఎస్‌ను పకడ్బందీగా అమ‌లు చేయాలని భట్టి విక్రమార్క అధికారులు సూచించారు.

ఈ ఎల్ఆర్ఎస్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 39 లక్షల ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని.. వీలైనంత వేగంగా పరిష్కరించాలని అధికారులకు భట్టి సూచించారు. జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని.. సిబ్బంది కొర‌త ఉంటే ఇత‌ర శాఖ‌ల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకోవాలని భట్టి సూచించారు. స‌మావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామ‌కృష్ణారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్, రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్యకార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్, గృహ‌నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీపీ గౌత‌మ్ తదిత‌రులు పాల్గొన్నారు.

మరోవైపు.. ధరణి పోర్టల్‌లో సమస్యలు, మార్పులు చేర్పులతో పాటు ఇతర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ధరణి సమస్యల పరిష్కారానికి లోతుగా అధ్యయనం చేయాలని.. సమస్యలకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. సవరణల వల్ల కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ధరణి పోర్టల్‌ విషయంలో మార్పులు, చేర్పులపై ప్రజాభిప్రాయం, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి.. వారి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. వారి అభిప్రాయాలు, సూచనలు ఆధారంగా సమగ్ర చట్టం తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ధరణిపై అవసరమైతే అసెంబ్లీలో చర్చ చేపడదామని సీఎం రేవంత్‌ తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి, కోదండరెడ్డి, కె.కేశవరావు తదితరులు పాల్గొన్నారు.

About rednews

Check Also

హైదరాబాద్‌లో భారీగా కుంగిన రోడ్డు.. పెద్ద ప్రమాదమే తప్పింది.. 200 మీటర్ల దూరంలోనే..!

హైదరాబాద్‌లోని గోషామహల్‌లో రోడ్డు భారీగా కుంగిపోయింది. మంగళవారం (అక్టోబర్ 22న) రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *