Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అభ్యర్థులు వ్యక్తిగత విమర్శలు చేసుకునే వరకు వెళ్లాయి. ఇక రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్.. హోరాహోరీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్.. ఆ తర్వాత రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో రహస్యంగా ఫోన్‌లో సంభాషణలు జరిపినట్లు తాజాగా కీలక విషయాలు బయటికి వచ్చాయి. అమెరికాకు చెందిన ఓ ప్రముఖ జర్నలిస్ట్ రాసిన పుస్తకంలో కొన్ని విషయాలు వెలుగులోకి రాగా.. ఆ పుస్తకం త్వరలోనే విడుదల కానుండగా.. అందులోని కీలక అంశాలను అమెరికా మీడియా వెల్లడించాయి.
అమెరికా జర్నలిస్ట్ బాబ్ వూడ్‌వర్డ్ రాసిన “వార్” అనే పుస్తకం ఈనెల 15వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే అందులోని కొన్ని విషయాలు స్థానిక మీడియాలో ప్రసారం అవుతున్నాయి. పదవి పోయిన తర్వాత ట్రంప్, పుతిన్ రహస్యంగా ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు ఆ పుస్తకంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం ప్రారంభం అయిన తర్వాత కూడా ఈ ఏడాది మొదట్లో ట్రంప్.. తన ఫ్లోరిడా ఎస్టేట్ నుంచి పుతిన్‌తో అత్యంత రహస్యంగా ఫోన్‌లో మాట్లాడినట్లు తాజాగా పుస్తకంలో పేర్కొన్నారు. అప్పుడు తన రూమ్‌లో ఎవరూ ఉండొద్దని తన భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిని ట్రంప్ బయటికి పంపించినట్లు తెలిపారు. 2021లో అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ దిగిపోయిన నాటి నుంచి పుతిన్‌తో కనీసం 7 సార్లు రహస్యంగా ఫోన్ మాట్లాడినట్లు బాబ్ వూడ్‌వర్డ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. .