Petrol Price: దేశీయంగా ఉత్పత్తి అవుతున్న ముడి చమురుపై విధించే విండ్ ఫాల్ ట్యాక్సుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ముడి చమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్ రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు విండ్ ఫాల్ ట్యాక్స్ రద్దు చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు మొదలు పెట్టిందని ప్రధాన మంత్రి సలహాదారు తరుణ్ కపూర్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన నేపథ్యంలో ఈ విండ్ ఫాల్ ట్యాక్సుకు ప్రాధాన్యం తగ్గిపోయిందని ఆయన పేర్కొన్నారు. పెట్రోలియం శాఖ ఇప్పటికే ఈ అంశాన్ని ఆర్థిక శాఖకు తెలియజేసి ఉంటుందని భావిస్తున్నట్లు ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. దీని రద్దును ఇప్పటికే ఆర్థిక శాఖ పరిశీలిస్తోందని తెలిపారు. రద్దు చేసినట్లయితే రిలయన్స్, ఓఎన్జీసీ వంటి సంస్థలకు ఊరట లభిస్తుంది.
పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై 2022, జులై 1వ తేదీ నుంచి విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తోంది కేంద్రం. దేశీయంగా చమురు ఉత్పత్తి చేసే కంపెనీలకు వచ్చే లాభాలపై విధించే పన్నునే ఈ విండ్ ఫాల్ ట్యాక్స్. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పశ్చిమ దేశాల్లో ఆంక్షలు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగేందుకు కారణమయ్యాయి. ఈ సమయంలో దేశీయ కంపెనీలకు భారీ లాభాలు వస్తుండడంతో విండ్ ఫాల్ ట్యాక్సును కేంద్రం తీసుకొచ్చింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖ పట్టిన క్రమంలో విండ్ ఫాల్ ట్యాక్స్ రద్దును పూర్తిగా రద్దు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.