Photos Videos ban in Yadadri Temple: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. అద్భుతమైన శిల్పకళతో అబ్బురపోయేలా తీర్చిదిద్దిన ఆలయాన్ని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా పక్కనున్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తుంటారు. అయితే.. స్వామివారిని దర్శించుకోవటంతో పాటు.. ఆలయ శిల్పకళను చూసి ముగ్దులవుతున్నారు. ఈ క్రమంలోనే.. ఆలయ ప్రాంగణంలో ఫొటోలు, వీడియోలు తీసుకుని మురిసిపోతున్నారు. అయితే.. ఫొటోలు, వీడియోలు తీసుకోవటం రోజురోజుకు పెరిగిపోతుండటంతో.. ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఆలయంలో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధిస్తూ కీలక ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో భాస్కర్ రావు మంగళవారం (అక్టోబర్ 22న) అధికారికంగా ప్రకటించారు.
ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా.. భక్తుల మనోభావాలు, విశ్వాసానికి ఆటంకం ఏర్పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. అయితే.. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు మాఢవీధుల్లో కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలు దిగితే తమకేం అభ్యంతరం లేదని అధికారులు చెప్తున్నారు. అయితే.. వ్యక్తిగత కార్యక్రమాలకు ఆలయాన్ని ఉపయోగించుకుంటే ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుందన్న కారణంతోనే.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు.
అయితే.. ఇటీవల హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన భార్య, కూతురితో కలిసి యాదాద్రి ఆలయ మాడవీధుల్లో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను తాను, తన కూతురు శ్రీనిక తమ సోషల్ మీడియాల్లో పోస్ట్ చేశారు. దీంతో.. సోషల్ మీడియాలో వాటిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఎమ్మెల్యేగా బాధ్యతమైన పదవిలో ఉండి.. ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా ఫొటోషూట్లు చేశారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.