Jio Lose: దేశీయ టెలికాం రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రిలయన్స్ జియోకు ఊహించని దెబ్బ తగిలింది. నెట్‌వర్క్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి త్రైమాసికంలో యూజర్లు పెరుగుతూ రావడమే కానీ, తగ్గిన దాఖలాలు లేవు. అయితే ఈ ఏడాది జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో మాత్రం ఊహించని విధంగా యూజర్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. గత మూడు నెలల్లో కోటి మందికిపైగా సబ్‌స్క్రైబర్లు జియోను వీడారు. అయితే, రీఛార్జ్ ప్లాన్లు పెంచినప్పుడు కస్టమర్లు ఇతర నెట్‌వర్క్‌లకు మారడం సర్వసాధారణమేనని, తమ సంస్థకు వచ్చిన పెద్ద ఇబ్బంది లేదని జియో వర్గాలు తెలిపాయి. త్వరలోనే వారంతా తిరిగి వస్తారని ధీమా వ్యక్తం చేశాయి.
ఏప్రిల్- జూన్ 2024 త్రైమాసికంలో రిలయన్స్ జియోకు 489.7 మిలియన్ల మంది అంటే దాదాపు 48.9 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. కానీ, అది జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి వచ్చే నాటికి యూజర్ల సంఖ్య 478.8 మిలియన్లు అంటే 47.8 కోట్లకు పడిపోయింది. అంటే దాదాపు 1.09 కోట్ల మంది జియో నెట్‌వర్క్ వీడారు. జులై నెలలో జియో రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరకే బెస్ట్ ప్లాన్లు తీసుకురావడంతో యూజర్లు అటువైపు మళ్లారు. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో బీఎస్ఎన్‌ఎల్‌కు కస్టమర్లు పెరిగారు.
అయితే, జియోకు సబ్‌స్క్రైబర్లు ఓవరాల్‌గా చూసుకుంటే తగ్గినప్పటికీ 5జీ వినియోదారుల సంఖ్య గణనీయంగా పెరగడం గమనార్హం. కొత్తగా గత సెప్టెంబర్ త్రైమాసికంలో 1.7 కోట్ల మంది జియో 5జీకి మారారు. దీంతో జియో 5జీ కస్టమర్ల సంఖ్య 13 కోట్ల నుంచి 14.7 కోట్లకు పెరిగింది. దీంతో సగటు యూజర్ రెవెన్యూ (ARPU) భారీగా పెరిగింది. అంతకు ముందు ఏఆర్‌పీయూ రూ.181.7 వద్ద ఉండగా.. అది క్యూ2లో 195.1కి పెరిగింది. దీంతో జియో నికర లాభం రూ.6536 కోట్లుగా ప్రకటించింది.