Bus Fire: ఎప్పుడూ స్కూల్, ఇల్లు ప్రపంచంగా ఉండే విద్యార్థులకు ఉల్లాసం కోసం, కొత్త విషయాలు, ప్రాంతాలు తెలియడం కోసం యాజమాన్యాలు అప్పుడప్పుడూ విహారయాత్రలకు తీసుకెళ్తూ ఉంటాయి. అయితే ఆ విహారయాత్ర కాస్తా విషాదంగా మారిన ఘటన ప్రస్తుతం ప్రతీ ఒక్కర్నీ కంటతడి పెట్టిస్తోంది. ట్రిప్‌కు వెళ్లిన స్కూలు విద్యార్థులు బాగా ఎంజాయ్ చేసి.. తిరిగి ఇంటికి వెళ్తున్నారు. అయితే వారు ప్రయాణించిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఆ బస్సు మొత్తం అగ్నికీలల్లో చిక్కుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ బస్సులో విద్యార్థులు, డ్రైవర్, టీచర్లు సహా మొత్తం 44మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 25 మంది చిన్నారులు.. ఆ మంటల్లో చిక్కుకుని కాలి బూడిదైపోయారు. ఈ భయంకరమైన ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నడిరోడ్డుపై బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుని కాలిపోవడం అందులో కనిపిస్తోంది. స్కూల్ ట్రిప్‌కు వెళ్లిన ఓ పాఠశాల బస్సు సెంట్రల్ ఉతాయ్ థాని ప్రావిన్స్ నుంచి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో 38 మంది విద్యార్థులు, ఆరుగురు టీచర్లు, బస్సు సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు మొత్తం 25మంది చనిపోయారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన థాయ్‌లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా.. చిన్నారుల మృతులకు సంతాపం తెలిపారు.
అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. టైరు పేలిపోయిందని కొందరు ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారు వెల్లడించారు. మరోవైపు.. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా అందులోని మృతదేహాలను బయటకు తీసుకురాలేదని స్థానికులు ఆరోపించారు. 16మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లను ఆ బస్సులో నుంచి బయటికి తీసుకువచ్చామని.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు థాయ్‌లాండ్ రవాణశాఖా తెలిపింది. మిగిలిన వారి పరిస్థితిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదని పేర్కొంది. ఆ మంటలు చూస్తుంటే వారంతా అందులోనే కాలి బూడిదైపోయి ఉంటారని స్థానికులు వెల్లడించారు.