టిక్కెట్ లేకుండా రైలు ఎక్కిన ఓ ప్రయాణికుడు.. టీటీఈ బెదిరించాడు. టిక్కెట్ ఏదని అడిగితే.. తనకు కేంద్ర మంత్రి తెలుసంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. దీంతో టీటీఈ సహా తోటి ప్రయాణికులంతా విస్తుపోయారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని మథుర జంక్షన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రైల్లో టిక్కెట్ లేకుండా ప్రయాణించేవారిని గుర్తించేందుకు మథుర జంక్షన్ వద్ద అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ధోలాపుర్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడ్ని రైల్వే స్టేషన్‌లో టీటీఈ ఆపి టికెట్ చూపించమని అడిగారు. టిక్కెట్ లేకుండా రైలెక్కి అతడు అడ్డంగా బుక్కయ్యాడు.
అయితే, టిక్కెట్ తీయని ఆ ప్రయాణికుడి తనకు కేంద్ర మంత్రితోపాటు పలువురు ప్రముఖులు తెలుసంటూ టీటీఈని బెదిరించేలా దబాయించాడు. అతడి మాటలకు అవాక్కయిన టీటీ.. వారితో మాట్లాడించాల్సిందిగా కోరారు. దీంతో ఖంగుతిన్న అతడు తెలివి ప్రదర్శించాడు. ఆ మంత్రి తనను గుర్తుపడతారో, లేదో అంటూ డొంక తిరుగుడు సమాధానం చెప్పడంతో అక్కడున్న వారంతా గొల్లున నవ్వారు. చివరకు టిక్కెట్ లేకుండా ప్రయాణించినందుకు నిబంధనల ప్రకారం జరిమానా విధించి ముక్కుపిండి వసూలు చేశారు అధికారులు. అతడు మథురలో ఆధ్యాత్మిక కార్యక్రమానికి వచ్చినట్టు తెలుస్తోంది. జరిమానా చెల్లించడంతో అతడ్ని వదిలిపెట్టామని అధికారులు తెలిపారు.