ఏపీఎస్ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది.. బస్సు టికెట్లపై 10శాతం రాయితీ ఇస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు నడుపుతున్న ఏపీఎస్ఆర్టీసీ డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి, వెన్నెల స్లీపర్ ఏసీ బస్సుల్లో ఈ రాయితీని ఇస్తోంది. ఈనెల 27 నుంచి వచ్చే నెల 5 వరకు ఆ ఆఫర్ ఉంటుంది.. అయితే ఆదివారం (అప్), శుక్రవారం (డౌన్)లను మినహా మిగిలిన రోజుల్లో ఛార్జీలపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా రూట్లలో, ఆ బస్సుల్లో ఛార్జీల వివరాలను ఓ ప్రకటనలో తెలియజేశారు.
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో ఎంజీబీఎస్‌కు ఆదివారం సాధారణ ఛార్జీ రూ. 770 కాగా.. మిగిలిన రోజుల్లో మాత్రం రూ. 700గా నిర్ణయించారు. అలాగే మిగిలిన ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆదివారం సాధారణ ఛార్జీ రూ. 830కాగా.. మిగిలిన రోజుల్లో రూ. 750గా నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేటప్పుడు.. శుక్రవారం సాధారణ ఛార్జీ, మిగిలిన రోజుల్లో రాయితీ ఛార్జీ వసూలు చేస్తారని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఇటు విజయవాడ నుంచి బెంగళూరు రూట్ విషయానికి వస్తే.. వెన్నెల స్లీపర్ ఏసీ బస్సుల్లో ఆదివారం మెజిస్టెక్ బస్టేషన్ వరకు సాధారణ ఛార్జీ రూ. 2170గా నిర్ణయించారు. మిగిలిన రోజుల్లో రూ.1970.. ఆపై ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆదివారం రూ. 2210.. మిగిలిన రోజుల్లో రూ. 2010గా నిర్ణయించింది ఆర్టీసీ. అమరావతి మల్టీ యాక్సిల్ బస్సుల్లో ఆదివారం మెజిస్టిక్ బస్టేషన్ వరకు సాధారణ ఛార్జీ రూ.1870కాగా.. మిగిలిన రోజుల్లో రూ.1700గా నిర్ణయించారు. ఆపై ప్రాంతాలకు ఆదివారం సాధారణ ఛార్జీ 1930కాగా.. మిగిలిన రోజుల్లో రూ. 1750గా రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఆర్టీసీ అధికారులు కోరారు.